అసలు ఎవరు ఈ గౌరీ లంకేష్..? ఏమిటీ ఆమె కథ..?

6 years ago janammata 0

 

 

అసలు ఎవరు ఈ గౌరీ లంకేష్..? ఏమిటీ ఆమె కథ..?   

గౌరీ లంకేష్… రెండు రోజులుగా పాత్రికేయలోకం తీవ్రంగా నిరసిస్తున్నది ఆమె హత్యను… ఖండనలు, సమర్థనలతో సోషల్ మీడియా, మీడియా హోరెత్తిపోతున్నది… ఇంతకీ ఎవరామె..? ఏమిటామె..? ఎందుకు టార్గెట్ అయ్యింది..? 1962లో ఓ లింగాయత్ కుటుంబంలో పుట్టిన ఆమె పేరు గౌరి… ఒక సోదరి కవిత, ఒక సోదరుడు ఇంద్రజిత్… తండ్రి పేరు లంకేష్… కవి, జర్నలిస్టు… తను సొంతంగా లంకేష్ పత్రికె పేరిట ఓ కన్నడ వీక్లీని నడిపేవాడు… బెంగుళూరులో టైమ్స్ ఆఫ్ ఇండియాకు పనిచేయడంతో ఆమె జర్నలిస్టు కెరీర్ స్టార్టయింది… తరువాత ఆమె భర్త చిదానంద్ రాజఘట్టతో కలిసి ఢిల్లీ వెళ్లింది… కొంతకాలానికే తిరిగి బెంగుళూరు వచ్చేసి, సండే మ్యాగజైన్‌కు పనిచేయసాగింది… దాదాపు 9 ఏండ్లు పనిచేసింది అందులో… 2000 సంవత్సరం ఆమె తండ్రి మరణించే సమయానికి ఆమె ఢిల్లీలో ఈటీవీ తెలుగు చానెల్‌కు పనిచేస్తూ ఉండేది… అవును, ఆమె ఈటీవీకి పనిచేసింది… ఢిల్లీలో పనిచేసిన ఈటీవీ జర్నలిస్టులకు ఆమె బాగా తెలుసు…తండ్రి మరణించాక ఆయన పత్రిక లంకేష్‌ను మూసేయాలని అనుకున్నారు గౌరి, ఆమె సోదరుడు ఇంద్రజిత్.,.. కానీ దాని పబ్లిషర్ వాళ్లకు నచ్చజెప్పాడు… కొనసాగించేలా చూశాడు… గౌరి ఎడిటర్‌గా, ఇంద్రజిత్ ప్రింటర్ అండ్ పబ్లిషర్‌గా అది కొనసాగింది కొన్నాళ్లు… అయితే పత్రిక లైన్ ఇంద్రజిత్‌కు నచ్చేది కాదు… 2001 నుంచే విభేదాలు పెరిగాయి… 2005లో పోలీసులపై నక్సలైట్ల దాడికి సంబంధించి, నక్సలైట్లకు అనుకూలంగా ఆమె రాసిన వ్యాసం ఈ విభేదాల్ని మరీ పెంచేసింది… మా ఆఫీసు నుంచి గౌరి ఒక కంప్యూటర్, ఒక స్కానర్, ఒక ప్రింటర్ దొంగిలించిందని ఆమె సోదరుడే పోలీసు కంప్లయింట్ ఇచ్చాడు… అసలు నా సోదరుడే రివాల్వర్‌తో బెదిరిస్తున్నాడంటూ ఆమె ఉల్టా కంప్లయింట్ చేసింది… ఇద్దరూ ఒకరిపై ఒకరు ప్రెస్‌మీట్లు పెట్టి, నిందించుకున్నారు… తరువాత ఆమె గౌరీ లంకేష్ పత్రికె అని సొంత వీక్లీని స్టార్ట్ చేసింది…ఆమె మొదటి నుంచీ హిందుత్వ శక్తులకు వ్యతిరేకి… 2012లో గురు దత్రాత్రేయ బాబా బుడాన్ దర్గాను హిందూకరీస్తున్నారంటూ పలు వ్యాసాలు రాసింది, ఖండించింది… ఆమె భావజాలం ఏమిటంటే…? ‘‘హిందుత్వ అనేది మతం కాదు… అది అగ్రవర్ణాల ఆధిపత్య వ్యవస్థ… మహిళలను ద్వితీయ పౌరులుగా చూసే వ్యవస్థ… లింగాయతులకు మైనారిటీ హోదా ఇవ్వాలి… వాళ్లు హిందువుల్లో భాగం కాదు… తత్వవేత్త బసవన్నను విశ్వసించేవాళ్లు కూడా హిందువులు కారు… అప్పటి ముఖ్యమంత్రి ఎస్.ఎం.కృష్ణ సన్నిహితుడు డీకే శివకుమార్ అక్రమాలపై కూడా అనేక వ్యాసాలు రాసింది ఆమె… నక్సలైట్లు లొంగిపోయి, జనజీవన స్రవంతిలో కలిసేలా ప్రయత్నించేందుకు కర్నాటక ప్రభుత్వం అప్పట్లో ఓ కమిటీని వేసింది.. గౌరి అందులో సభ్యురాలు… ఒక నక్సలైట్ సానుభూతిపరురాలిని ఈ కమిటీలో ఎలా వేస్తారు..? ఆమెను తొలగించాలంటూ బీజేపీ గొడవ చేసింది… కానీ సిద్ధరామయ్య ఆ డిమాండ్‌ను తోసిపుచ్చాడు…కులవ్యవస్థను బహిరంగంగానే వ్యతిరేకించే ఆమె బ్రాహ్మణిజాన్ని ప్రత్యేకించి టార్గెట్ చేసేది… పిల్లల కోసం ఓ హిందూ జంట, ఏకాభిప్రాయంతో ఓ వివాహేతర సంబంధం పెట్టుకునే కంటెంట్‌తో నిమ్నవర్గాలకు చెందిన రచయిత పెరుమాల్ మురుగన్ ఒక నవల రాస్తే అది బ్రాహ్మణ వర్గాల విమర్శలకు గురైంది… మహాభారతాన్ని ‘పర్వ’ పేరుతో తిరగరాసిన భైరప్ప కూడా ‘నియోగ’ పేరుతో చెప్పింది అదే కదా..? అని ఆమె ప్రశ్నించింది… ఇదీ వివాదం… హసన్ జిల్లా బ్రాహ్మణ సభ ఓ పెద్ద ర్యాలీ తీసి, ఆమెపై కేసు పెట్టాలంటూ డిమాండ్ చేసింది.., శ్రావణబెళగొళలో జరిగిన కన్నడ సాహిత్య సమ్మేళనంలోనూ ఇదే గొడవ… 2008లో దరోడెగిలడ బీజేపీ గళు పేరిట ఓ వ్యాసం రాసింది… అంటే దోపిడీ బీజేపీ అని…! అందులో బీజేపీ నాయకులు ప్రహ్లాద్ జోషి, ఉమేష్ దూషి, శివానంద భట్, వెంకటేశ్ మేస్త్రీ తదితరులపై అనేక ఆరోపణలు చేసింది… ఓ నగల వ్యాపారిని వాళ్లు మోసం చేసిన తీరుపై ఆ వ్యాసం…ఆమెపై జోషి, దూషి పరువునష్టం దావాలు వేశారు… ఇవే ఆరోపణలు చేసిన ఇతర పత్రికల్ని వదిలేసి, తను లెఫ్ట్ భావజాలాన్ని అనుసరించేదాన్ని కాబట్టి టార్గెట్ చేసి, కేసులు పెట్టారని ఆమె వాదించింది… కానీ తన కథనానికి ఆధారాలు చూపించలేకపోవడంతో కోర్టు ఆమెకు ఆరు నెలల జైలు శిక్ష విధించింది… ఆమె అదే కోర్టు నుంచి యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకుంది… ఇది మరో గొడవ… ఇంతకీ ఆమె వ్యక్తిగత జీవితం గురించి అంటారా..? భర్త, కాలమిస్టు చిదానంద రాజఘట్టతో పడక విడాకులు తీసుకుంది… తరువాత ఒంటరిగానే ఉంటున్నది… పిల్లల్లేరు… పక్కా కమ్యూనిస్టు భావజాలం… హిందుత్వ వ్యతిరేక భావజాలం… జేఎన్‌యూ వివాదాస్పద నేతలు కన్హయ్యకుమార్, జిఘ్నేష్, ఉమర్ ఖలీద్, షెహలా రషీద్‌లను తన దత్తత పిల్లలుగా చెప్పేది… వాళ్లు బెంగుళూరు వస్తే, ఆమె ఇల్లే అడ్డా…ఆమె హత్య, తదనంతర పరిణామాలు అన్ని పత్రికల్లో విరివిగా వస్తున్నవే, అందుకే ఇక్కడ అవేవీ మళ్లీ చెప్పడం లేదు… అయితే ఏ రాజ్య స్వభావాన్ని ఆమె జీవితాంతం వ్యతిరేకించిందో ఆదే రాజ్యం ఆమెకు అధికారికంగా ‘గన్ సెల్యూట్’ సహా అంత్యక్రియలు నిర్వహించడం, అదీ లింగాయత్ సంప్రదాయాల మేరకు జరిపించడం విశేషం..!